వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొద్ది నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. మహిళలను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే.. వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్త రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతోందని.. మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకొని టీడీపీ, జనసేన నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలపై బరితెగించి పోస్టులు పెట్టినా.. వారికి కేసులు పెట్టడం లేదని, ఎందుకంటే వారిని టీడీపీ-జనసేన పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా దుర్వినియోగం పై ఇప్పటికే వందల ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు.