సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్
అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు, నిర్వహణపై భేటీలో చర్చించనున్నారు. దీంతో పాటు పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు.
సైనిక కుటుంబాలతో పాటు ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులను అందజేయనున్నారు. అనంతరం నితీశ్ కుమార్ ఇచ్చే లంచ్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.