మునుగోడు ఉపఎన్నికపై కేసీఆర్​తో సీపీఎం నేతల భేటీ

-

మునుగోడు గద్దెను ఎలాగైనా చేజిక్కించుకోవాలని తెరాస పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రచార వ్యూహాన్ని రెడీ చేసుకుంది. ఎలాగైనా మునుగోడు సింహాసనాన్ని అధిష్ఠించాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సీపీఎం మద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఎం నేతలు నేడు భేటీకానున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసకు సీపీఎం మద్దతు ప్రకటించిన తరవాత తొలిసారి సీఎంతో సమావేశం అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకోంది. రాత్రి 7 గంటలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తాజా రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రితో సమావేశం నేపథ్యంలో పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తెలిపారు.

భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్‌ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి, ఈ ఎన్నికలో తమ మద్దతు తెరాస ​ పార్టీకే ఉంటుందని మునుగోడు సభకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్న మాటలివి. ఈ ఒక్క ఎన్నికలో మాత్రమే తెరాస పార్టీకి మద్దతు ఇస్తామని నిన్నటి సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news