వర్షాకాలంలో మనకు వచ్చే అనేక వ్యాధుల్లో జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరంలు సహజమైనవి. పలు రకాల వైరస్‌ల వల్ల ఈ వ్యాధులు వస్తాయి.
వర్షాకాలం జోరందుకుంది.. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరాలు, పట్టణాల్లో జనాలు వరద నీటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ఈ సమస్యలు కామనే గానీ.. మనం ముఖ్యంగా మన ఆరోగ్యంపై ఈ సీజన్‌లో జాగ్రత్త వహించాలి. ఎన్నో వ్యాధులు ఈ కాలంలో మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. మరి ఆ వ్యాధులు ఏమిటో, వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం
వర్షాకాలంలో మనకు వచ్చే అనేక వ్యాధుల్లో జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరంలు సహజమైనవి. పలు రకాల వైరస్‌ల వల్ల ఈ వ్యాధులు వస్తాయి. కనుక మన ఇంటితోపాటు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వర్షంలో ఎక్కువగా తడవరాదు. అలాగే దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో గడపరాదు. పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు ముక్కుకు, నోటికి అడ్డంగా కర్చీఫ్ లేదా మాస్క్‌ను ధరించాలి. ఎదుట ఉన్నవారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా.. ముక్కుకు, నోటికి చేతులు లేదా కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవాలి. మనం ఆ పనులు చేసినా కర్చీఫ్ అడ్డు పెట్టుకుని చేయాలి. దీంతో ఈ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు. ఫలితంగా ఈ వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.
2. విష జ్వరాలు
వర్షాకాలం వచ్చే విష జ్వరాల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌లు చాలా ముఖ్యమైనవి. ఇవి దోమలు కుట్టడం వల్ల మనకు వస్తాయి. అందువల్ల ఇంట్లో దోమల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. దోమ తెరలను వాడాలి. ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మార్కెట్‌లో ఆయుర్వేదిక్ మస్కిటో రీపెల్లెంట్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎలాంటి హానీ కలగదు. దోమల నుంచి ఎంత దూరంగా ఉంటే మనకు ఈ విష జ్వరాలు అంత త్వరగా రాకుండా ఉంటాయి.
3. కలరా
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో కలరా కూడా ఒకటి. ఇది కలుషితమైన నీరు తాగడం, ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. అందువల్ల ఎవరైనా ఇంట్లో లేదా బయట నీరు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు, ఆహారం నాణ్యంగా ఉన్నాయని భావిస్తేనే వాటిని తీసుకోవడం మంచిది. లేదంటే కలరా లేదా డయేరియా వస్తాయి. కనుక ఈ సీజన్‌లో మనం తినే ఆహారం, తాగే నీరు పట్ల చాలా జాగ్రత్త వహించాలి.
4. హెపటైటిస్ ఎ
కలుషితమైన ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఈ వ్యాధి వచ్చిన వారిలో లివర్‌పై బాగా ప్రభావం పడుతుంది. వారిలో జ్వరం, వాంతులు, ఒంటిపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. ఈ సీజన్‌లో స్వచ్ఛమైన నీరు తాగాలి. అలాగే నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. వీలైనంత వరకు బయటి ఆహారాలను ఈ సీజన్‌లో తినడం మానేస్తే మంచిది.