ఈ మధ్యకాలంలో హైబీపీ సమస్యతో అధిక మంది బాధపడుతున్నారు. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు, పని ప్రదేశంలో ఉండే ఒత్తిళ్లు, ఇంకా అనేక ఇతర సమస్యల కారణంగా హై బీపీ బారిన పడ్డవారు పెరుగుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం భారతదేశంలో ప్రతీ నలుగురిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నారు. ఇందులో కేవలం 12 శాతం మంది మాత్రమే తమ బీపీని కంట్రోల్ లో ఉంచుకుంటున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే మరి కొన్ని రోజుల్లో బీపీ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరగనుందని హెచ్చరిస్తున్నారు. అయితే హైబీపీని లైఫ్ స్టైల్ లో మార్పుల ద్వారా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
ఉప్పు తగ్గించాలి:
ఇండియాలో ఎక్కువమంది హైబీపీ సమస్యతో బాధపడడానికి ప్రధాన కారణం ఉప్పు. రోజువారి ఆహారంలో దీని వాడకాన్ని తగ్గిస్తే మంచిది. అంతేకాదు, ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలను, ప్యాకేజీల్లో ఉండే పదార్థాలను తినకపోవడం మంచిది.
ఒత్తిడి నుండి బయటపడండి:
ఒత్తిడి కారణంగా మెదడులో అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే హార్ట్ ఎటాక్ వస్తాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకోండి.
కావాల్సినంత నిద్ర:
నిద్రను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి దారితీస్తుంది. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే బీపీ పెరిగి అనేక అనర్ధాలు కలుగుతుంటాయి. శరీరానికి తగినంత విశ్రాంతి దొరికితే అది తనను తాను రిపేర్ చేసుకుంటుంది.
వ్యాయామం:
క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. బరువు పెరగకపోతే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కాబట్టి వారంలో కనీసం ఐదు రోజులు కచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి.
డైట్:
మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండాలి. కూరగాయలు, ప్రోటీన్ కలిగిన ఆహారాలు, తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు, పొటాషియం అధికంగా గల అరటి పండ్లు, ఆకుకూరలు వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గి బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.