ఒక నగరంలో ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్న టేస్టీ వంటకాలు ట్రై చేయాలనుకునే వారి కోసం జొమాటో ఇంటర్సిటీ లెజెండ్స్ పేరుతో ప్రత్యేకమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గురుగ్రామ్‌కు చెందిన ప్రతీక్ కన్వాల్ హైదరాబాద్ బిర్యానీ ట్రై చేయాలనుకున్నాడు. కానీ అతడికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ బిర్యానీ కోసం ఆర్డర్ చేస్తే.. జొమాటో కేవలం సాలన్ (బిర్యానీకి సైడ్ డిష్‌గా ఇచ్చే వంటకం) మాత్రమే డెలివరీ చేసింది. పైగా ఆ వ్యక్తి జొమాటో వాటాదారుడే కావడం గమనార్హం. తీవ్ర అసహనానికి గురైన ప్రతీక్.. ట్విటర్ వేదికగా తన చేదు అనుభవాన్ని వివరించారు.
“జొమాటో ఇంటర్సిటీ లెజెండ్ సర్వీస్ మంచి ఐడియా అనిపించింది. కానీ దీని వల్ల నా డిన్నర్ ప్లాన్స్ గాల్లో కలిశాయి. ఓ కస్టమర్‌గా, జొమాటో వాటాదారుడిగా ఇది నాకు రెట్టింపు నష్టమే. ఇందులో వైఫల్యం ఎక్కడుందో దీపిందర్ గోయల్ (జొమాటో సీఈఓ) వెంటనే గుర్తించాలి. కనీసం మరోసారి ఇలా జరగకుండా చూడాలి” అని ప్రతీక్ రాసుకొచ్చారు. జొమాటో, దీపిందర్ గోయల్ ట్విటర్‌కు ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.
అయితే ఈ ట్వీట్‌పై జొమాటో కస్టమర్‌కేర్ సర్వీస్ వెంటనే స్పందించింది. ప్రతీక్‌కు క్షమాపణలు చెప్పి, అదనంగా మరో బిర్యానీని కూడా అందించింది. ఈ విషయాన్ని కూడా ప్రతీక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైందని.. కనీసం కస్టమర్ కేర్ సర్వీస్ అయినా వేగంగా స్పందించినందుకు ఓ వాటాదారుగా తాను కాస్త సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు.
Credit where it’s due! Sushant from customer service and product head of @zomato interstate legends not only tracked my Biryani but also sent me an extra Biryani from @biryanibykilo! Issue has been resolved @deepigoyal! Atleast, as a shareholder I feel good about customer service pic.twitter.com/nZ1O7TvsAJ
— Prateek Kanwal (@prateekkanwal) September 3, 2022