ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ లీగ్ దశను భారత్ విజయంతో ముగించింది. ఇవాళ హెడింగ్లీలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా సాధించింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ లీగ్ దశను భారత్ విజయంతో ముగించింది. ఇవాళ హెడింగ్లీలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ అవలీలగా సాధించింది. 43.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 265 పరుగులు చేసింది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లను ఆడిన ఇండియా 7 మ్యాచ్ లలో విజయం సాధించగా, ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది. మరొక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు చేరాయి.
కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ తీసుకుని 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 264 పరుగులు చేయగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఏంజెలో మాథ్యూస్ (128 బంతుల్లో 113 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లాహిరు తిరిమన్నె (68 బంతుల్లో 53 పరుగులు, 4 ఫోర్లు)లు రాణించారు. ఇక భారత బౌలర్లలో జస్‌ప్రిత్ బుమ్రాకు 3 వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. క్రమంగా వేగం పెంచింది. దీంతో మరో 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. ఇక భారత బ్యాట్స్‌మెన్లలో లోకేష్ రాహుల్ (118 బంతుల్లో 111 పరుగులు, 11 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు)లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. కాగా లంక బౌలర్లలో లసిత్ మలింగ, కసున్ రజిత, ఇసురు ఉదానాలకు తలా 1 వికెట్ దక్కింది.