భక్తి, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు అరుదుగా దేవాలయాల్లోకి వెళ్తుంటారు. అయితే అక్కడ ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాల్లో ఎప్పుడూ అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం…
- దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. సాక్షాత్తు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తున్న తండ్రి/తల్లిగా భావించి వారికి శక్తిమేరకు ఏదో ఒకటి తీసుకునిపోవాలి.
- ఇంట్లోపూసిన పూలు, మారేడు దళాలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే దాన్ని తప్పక తీసుకుని పోవాలి.
- దేవాలయానికి పోయిన వెంటనే అవకాశం ఉంటే కాళ్లు, చేతులూ కడుగుకోవాలి.
- వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్లి స్వామి/అమ్మవారిని మనస్సులో స్మరించుకుని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం మూడు తప్పనిసరి. చేయాలి.
- తర్వాత దేవాలయంలోని గర్భగుడి ముందు ఎదురుగా కాకుండా పక్కకు నిలబడి దేవతామూర్తిని దర్శనం చేసుకోవాలి. వీలైతే మగవారు సాష్టాంగం, ఆడవారు అర్ధసాష్టాంగ నమస్కారం చేసుకోవాలి.
- అనంతరం తీర్థాన్ని, శఠగోపరాన్ని తీసుకోవాలి. అక్కడక్కడి పరిస్థితులను బట్టి ఒక్కసారి లేదా మూడుసార్లు తీర్థం ఇస్తారు. ఒకవేళ మూడు సార్లు ఇస్తే విడివిడిగా తీసుకోవాలి.
- తీర్థం తీసుకుని లోపలికి స్వీకరించే సమయంలో చప్పుడు రాకుండా తీసుకోవాలి.
- శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమ పూజ ఇష్టం చేస్తే మంచి జరుగుతుంది.
- దైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
- శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. అదేవిధంగా ఆయా దేవాలయాల్లో మూలవిరాట్టులకు వారి వారి వాహనాలకు మధ్య నడువరాదు.
- దేవాలయంలో దర్శనం పూర్తయిన తర్వాత ఆవరణలో ఒక్కనిమిషమైనా కూర్చుని భగవంతుని ధ్యానం చేసుకుని వస్తే మంచిది.
- దేవాలయంలో ఎట్టిపరిస్థితుల్లో గట్టిగా మాట్లాడవద్దు, సెల్ఫొన్లు తీసుకపోవద్దు. – – – దేవాలయంలో అనవసర విషయాలు, మాటలు మాట్లాడకండి, ఎక్కువ భగవంతుని మనస్సులో స్మరిస్తూ కాలాన్ని గడపాలి.
- క్యూలైన్లలో తప్పక నిదానంగా, పక్కవారికి ఇబ్బంది కలుగకుండా పోవాలి.
- డాంబికాలు, అధికార ప్రదర్శనలు, ఆర్థిక ప్రదర్శనలు చేస్తే వాటివల్ల తప్పక చెడు జరుగుతుంది.
- దేవుని దగ్గర అందరూ సమానమనే వేదోక్తిని గుర్తుంచుకుని పోండి. పెద్దలకు, పిల్లలను, వికలాంగులకు సహాయపడండి, వారిని గౌరవించండి.
- లైన్లలో తోసుకుని పోవడం, వేగంగా పోతూ ఇతరులను డాష్ ఇవ్వడం చేయకండి.
- ప్రదక్షిణ నియమావళిని పాటిస్తే తప్పక మంచి జరగుతుంది.
- గట్టిగా స్తోత్రాలు, పాటలు పాడకండి, ఇతరుల ధ్యానాన్ని భంగ పర్చకండి.
- బయటకు వచ్చిన తర్వాత శక్తిమేరకు దానం, ధర్మం చేయండి.
- ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లు కడుగవద్దు. ప్రసాదాన్ని అందరూ భక్తి, వినమ్రతలతో స్వీకరించండి.
ఈ కనీస నియమాలు పాటిస్తే తప్పక మంచి జరుగుతుంది.
– కేశవ