సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బీసీ సంక్షేమశాఖ గురుకులాల ప్రిన్సిపాల్స్, రీజనల్ కోఆర్డినేటర్లు, బీసీ హాస్టల్స్ వార్డెన్లు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీలు గతంలో విద్యాలయాలు, ఆర్థిక పరిస్థితి సరిగా లేక కులవృత్తులను చేసుకుంటూ విద్యకు దూరమయ్యారని, నేడు చదువుతో పాటు కులవృత్తుల్లో రాణించే సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. విద్యాపరంగా, పాలనాపరంగా, సంక్షేమపరంగా రాష్ట్రంలో మెజారిటీ ఉన్న బీసీలకు సీఎం కేసీఆర్ పెద్ద వాటా ఇచ్చారన్నారు మంత్రి గంగుల.
తెలంగాణ ఏర్పాటుకు ముందు 19 గురుకులాల ఉండగా.. 310కి పెంచి.. 1,65,400 మంది బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు మంత్రి గంగుల. 700 హాస్టళ్లలో 413 ప్రీమెట్రిక్ హాస్టల్స్, 287 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 57,783 మందికి ఆశ్రయం కల్పించి విద్యనందిస్తున్నట్లు చెప్పారు మంత్రి గంగుల. అక్టోబర్‌లో మరో 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలను మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సులతో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మంత్రి గంగుల. ఇంతమంది పిల్లలు బీసీ గురుకులాల్లో చదివి ఉన్నత ఉద్యోగులుగా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు మంత్రి గంగుల. ఇంగ్లిష్ మీడియంలో చదువుతూ పెద్ద కొలువులు సాధిస్తున్న వారిని చూసి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారని, దాన్ని మరింత పెంచే బాధ్యత మనందరం తీసుకోవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.