జపాన్ మాజీ ప్రధాని అంత్యక్రియలు.. అధికార లాంఛనాలు వద్దంటూ ప్రజల నిరసన

-

జులై 8న నారాలో ఎన్నికల ప్రచారసభలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు జపాన్ వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి.. చర్చి. రెండోది.. ఖర్చు.

యూనిఫికేషన్​ చర్చి.. జపాన్​లో ఎప్పటి నుంచో వివాదాస్పదం. ఈ​ చర్చికి, అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్​డీపీ)కి సంబంధం ఉందని షింజో అబే హత్య తర్వాత వెలుగులోకి రావడం విమర్శలకు తావిచ్చింది. చర్చి కారణంగానే తన కుటుంబం తీవ్ర అవస్థలు పడిందని, అందుకే దానితో సంబంధం ఉన్న అబేను చంపానన్నది నిందితుడి వాదన.

ఇది జపాన్​వ్యాప్తంగా చర్చనీయాంశంకాగా.. అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చర్చితో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకుంటామని ప్రకటించింది. మరోవైపు.. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా ఎల్​డీపీలోని అబే వర్గీయుల్ని ప్రసన్నం చేసుకోవచ్చన్నది కిషిద ఆశ అనేది విశ్లేషకుల మాట.

రెండో అంశం ఖర్చు. షింజో అంత్యక్రియలకు జపాన్ ప్రభుత్వం ఏకంగా రూ.11.8మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.96 కోట్ల 28 లక్షల 74 వేలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. షింజో అబే విధానాలతో పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు తొలగించడం వంటి అర్థవంతమైన పనులకు ఈ డబ్బులు ఉపయోగిస్తే బాగుంటుందన్నది ప్రత్యర్థుల వాదన.

Read more RELATED
Recommended to you

Latest news