బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఐటీ పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తానని బిజెపి పెద్దలకు చెప్పినట్లు సమాచారం ఉందని అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి ఎంత ఖర్చు పెట్టినా గెలవదని చెప్పారు.
మునుగోడులో టిఆర్ఎస్ పార్టీీ గెలిచిందని.. రెండు మూడు స్థానాలకు కాంగ్రెస్, బిజెపి మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ఉప ఎన్నిక కోసం రాజగోపాల్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షా ఓ పెద్దమనిషికి చెప్పాడట, ఆ పెద్దమనిషి తనని కలిసి ఆ విషయాన్ని చెప్పాడని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే బిజెపి యేతర పార్టీల పాలిత రాష్ట్రాలలో మోడీ ఆదేశాలతో ఈడి, సిబిఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సంస్థలు బిజెపి అనుబంద సంఘాలుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.