తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. సాగర్ ఎడమ కాల్వ వద్ద లాయర్ నిఖిల్ శవమై తేలాడు. యువతి బంధువులే నిఖిల్ ను హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది పరువు హత్యనే నిఖిల్ కుటుంబ సభ్యులు అంటున్నారు. రెండు రోజుల కిందట అదృశ్యమైన యువకుడు కాలువలో శవమై కనిపించాడు. ప్రేమ వ్యవహరం కారణంగానే తమ కుమారుడిని హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది పరువు హత్యేనని, కుల దురహంకారంతో హత్య చేశారని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన అడ్వొకేట్, మాజీ కౌన్సిలర్ దరావత్ భాస్కర్‌కు కుమారుడు నిఖిల్ (24) హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవల ఎల్ఎల్‌బీ పూర్తి చేసి దసరా పండుగకు ఇంటికి వచ్చాడు. ఆదివారం(అక్టోబర్ 9) స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని అర్థరాత్రి వరకు వేడుకలు జరుపుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తల్లి కోటమ్మ ఫోన్ చేయగా.. కొద్ది సేపటిలో వస్తానని చెప్పాడు. ఎంతసేపటికి నిఖిల్ రాకపోవడంతో మరోసారి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు.