ఏపీ రాజకీయాల్లో బలమైన పార్టీ, బలమైన నాయకుడు అంటే..ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ బలమైన పార్టీ అని, జగన్ బలమైన నాయకుడు అని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి..అలాగే ఏ ఎన్నికైన ఆ పార్టీనే వన్ సైడ్‌గా గెలుస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు..జగన్‌కు చెక్ పెట్టాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కొంతవరకు సక్సెస్ అవ్వగలుగుతున్నారు గాని..పూర్తి స్థాయిలో వైసీపీని నిలువరించలేకపోతున్నారు.
వైసీపీ అధికార బలం ముందు టీడీపీ తేలిపోతుంది..అటు మూడో బలమైన పార్టీగా ఉన్న జనసేన కూడా సత్తా చాటలేకపోతుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్..అనుకున్న స్థాయిలో ఈ మూడేళ్లలో బలం పెంచుకోలేకపోయారు. కాకపోతే టీడీపీని అణిచివేసేలా, జనసేనని అణిచివేసే కార్యక్రమం వైసీపీ చేయలేదు. కానీ తాజాగా విశాఖలో ఆ కార్యక్రమం మొదలుపెట్టింది. విశాఖ ఎయిర్‌పోర్టులో జనసేన శ్రేణులు..మంత్రులపై దాడులు చేశారని చెబుతూ..జనసేన నేతలని, కార్యకర్తలని అరెస్ట్ చేశారు.
అలాగే పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు నోవాటెల్ హోటల్లోనే నిర్భదించారు. ఇక కొందరు జనసేన శ్రేణులు జైలు నుంచి విడుదలయ్యాక పవన్..విజయవాడకు వచ్చి బీజేపీ నేతలతో కలిసి మాట్లాడి..ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెక్స్ట్ మంగళగిరి జనసేన ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమై..వైసీపీ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు. వైసీపీ గూండాలు, రౌడీలు, సన్నాసులు అంటూ రెచిపోయారు. ఇంకా పరుష పదజాలంతో తనని ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని ఘాటుగా మాట్లాడారు.
అలాగే బీజేపీతో కలిసి సరిగ్గా పోరాడలేకపోయామని, అయినా తనకు మోదీ అంటే గౌరవమని, బీజేపీ అంటే గౌరవమని చెబుతూనే..ఇకపై తన వ్యూహాలు మార్చుకుంటానని చెప్పారు. అలా చెప్పిన నెక్స్ట్..పవన్‌తో చంద్రబాబు అనూహ్యంగా భేటీ అయ్యారు. పవన్ ఉన్న హోటల్‌కు వచ్చి బాబు కలిశారు. అంతకముందే విశాఖలో ఉన్నప్పుడు పవన్‌తో ఫోన్ మాట్లాడి సంఘీభావం తెలిపిన బాబు..డైరక్ట్‌గా పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు.
అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని అటు బాబు, ఇటు పవన్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉన్నా సరే..ఇద్దరు కలిసి ఎన్నికల బరిలో వైసీపీని ఎదుర్కొబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. ఎలాగో బాబుకు సింగిల్‌గా జగన్‌కు చెక్ పెట్టే బలం రావడం లేదు..దీంతో పవన్ కల్యాణ్ రూపంలో జగన్‌పై ఓ అస్త్రాన్ని సంధించనున్నారు.
పవన్‌కు కూడా బాబుతో కలవడం చాలా ముఖ్యం. టీడీపీ-జనసేన కలిస్తేనే ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, వైసీపీకి ప్లస్ అయింది. ఈ సారి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని బాబు-పవన్ కలిసి జగన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ ఇద్దరిని ఎదురుకోవడానికి జగన్ ఎలాంటి అస్త్రాలతో ముందుకొస్తారో చూడాలి.