త్వరలోనే పాదయాత్రను పునఃప్రారంభిస్తామని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. మహాపాదయాత్ర నిలుపుదల చేసిన రామచంద్రాపురం నుంచే మళ్లీ పాదయాత్ర మొదలుపెడతామని చెప్పారు. రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి మాట్లాడారు.
రైతులతో, సమన్వయ కమిటీలతో సమావేశం నిర్వహించి ప్రారంభ తేదీని మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని శివారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి కోర్టు తీర్పు ద్వారా ఇకనైనా బుద్ధి రావాలని, పాదయాత్రకు అడ్డంకులు సృష్టించకూడదని చెప్పారు. పాదయాత్ర దివ్య రథానికి అమర్చిన సీసీ కెమెరాలను పోలీసులు తీసుకెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సీసీ కెమెరాలు తీసుకెళ్లిన పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని శివారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ఒకే రాజధాని విశాఖ అన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై రాయలసీమ వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని శివారెడ్డి నిలదీశారు.