మునుగోడు ఉప ఎన్నికకు ప్రచారం నేటి సాయంత్రంలో ముగియనున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికను ఉద్దేశించి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మొనగాళ్లకు, మోసగాళ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, తెలంగాణ పురోగతికి పట్టం కడుతారనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సవ్యంగా వాడండనని కేటీఆర్ అన్నారు. ఆగం కాకండని, ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కేటీఆర్.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అహంకారానికి మధ్య జరుగుతున్న సమరంలో.. పెద్ద ఎత్తున పని చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని కేటీఆర్ అన్నారు. సర్వశక్తులు ఒడ్డి, బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టి పెట్టి, ఎన్నో ప్రయత్నాలు, కుయుక్తులు కుట్రలు పన్ని రాజ్యాంగ సంస్థలను తన ఆధీనంలో పెట్టుకుని, ఎన్నికల గుర్తుల విషయంతో పాటు, మా మంత్రిని ప్రచారానికి రాకుండా ఆపారని కేటీఆర్ ఆరోపించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని, అదే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్న వామపక్షాల నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.