ట్విటర్‌ను టేకోవర్ చేసిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు సగం మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ పూర్తిగా కాదు. ఏంటీ కన్ఫ్యూజన్ అంటారా. తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందిని తిరిగి ఆఫీసుకు రమ్మంటూ ట్విటర్ మెయిల్స్ పంపిస్తోందట. జాబితాలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల పొరపాటున కొంతమందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని మెయిల్లో రాసుకొచ్చిందట. అలాగే మరి కొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలోనూ విఫలమైనట్లు ట్విటర్ భావిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు.
ట్విటర్లో ఎలాన్ మస్క్ లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది సేవలు తప్పనిసరి అని సంస్థ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవ్యక్తులు తెలిపారు. అందుకే వారిని తిరిగి ఆఫీసుకు రావాలని కోరుతున్నారట. దీనిపై ట్విటర్ యాజమాన్యంగానీ, అధినేత ఎలాన్ మస్క్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.