ఉన్నత చదువు చదువుకున్నా.. జ్ఞానం మాత్రం ఇంకా అదమస్థాయిలోనే ఉంది కొందరికి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఎదగుతున్నా.. ఆడపిల్ల పుట్టడాన్ని ఇంకా కొంతమంది అవమానకరంగా భావిస్తోన్నారు. ఆడపిల్ల పుట్టిందని భార్యల పట్ల భర్త, అత్తింటివారు కర్కశంగా ప్రవర్తిస్తోన్నారు. ప్రస్తుతం సమాజం అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా కొంతమంది ఆడపిల్లల పట్ల వివక్షను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటన మరోకటి చోటుచేసుకుంది. ఆడపిల్లకు జన్మనిచ్చిందని కట్టుకున్న భార్యను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఏరియాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన శకుంతలను కొన్నేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పెళ్లి చేసుకున్నాడు. మొన్నటివరకు ఇద్దరూ బాగానే ఉన్నారు.
కానీ ఇటీవల భార్యకు ఆడపిల్ల పుట్టిందని ఆమెను పుట్టింట్లో వదిలేసి వచ్చాడుభర్త . అత్త,మామ మాత్రం బిడ్డ తమకు పుట్టలేదని వాదిస్తున్నారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. రూ.కోటి విలువ చేసే ఫ్లాట్‌తో పాటు బంగారం, వెండి భారీ ఎత్తున కట్నకానుకలుగా ఇచ్చామని, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని పుట్టింట్లో వదిలేసి వెళ్లారని శకుంతల ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పోలీసులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు తరుచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో కోడలిని అత్తింటివారు వేధించి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆ వేధింపులు భరించలేక కొంతమంది మహిళలు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు.