మా ఎన్నికల్లో చైనా వేలు పెట్టింది : కెనడా ప్రధాని ట్రూడో

-

చైనా..  ప్రజాస్వామ్యాలతో ప్రమాదకరంగా చెలగాటమాడుతోందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించారు. కెనడాలోని పలు సంస్థలను బీజింగ్‌ టార్గెట్ చేస్తోందని అన్నారు. చైనా.. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపణలు చేశారు.

‘‘మా ఎన్నికల వ్యవస్థలు, విధానాలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకొన్నాం. ఎన్నికల్లో జోక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాం. మా ప్రజాస్వామ్యాలు, సంస్థల్లో జోక్యంపై పోరాడుతుంటాం. ప్రపంచ వ్యాప్తంగా చైనా, మరికొన్ని దేశాలు వీటితో చెలగాటమాడటం చూస్తున్నాం’’ అని ట్రూడో వ్యాఖ్యానించారు.

బీజింగ్‌ కెనడాలో ఓ రహస్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొందని ‘ది కెనెడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌’(సీఎస్‌ఐఎస్‌) గుర్తించినట్లు స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడటంపై ట్రూడో స్పందించారు. 2019 ఎన్నికల్లో చైనా మద్దతు ఉన్న దాదాపు 11 మంది అభ్యర్థులు పోటీచేశారని అధికారులు ట్రూడోకు వివరించినట్లు వాటిల్లో పేర్కొన్నారు. 2019-21 మధ్యలో చాలా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకొన్నట్లు గుర్తించారు.

చైనా.. కొందరు అభ్యర్థులు, వారి ప్రచార సలహాదారులుగా ఉన్న చైనీస్‌ ఆపరేటివ్‌లకు నగదును తరలించినట్లు కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ పేర్కొంది. ఒంటారియాలోని  ప్రావిన్షియల్‌ ఎంపీ ఒకరికి 2.5లక్షల డాలర్ల చెల్లించినట్లు గుర్తించారు. చైనా ప్రభావితం చేసిన ఎంపీల్లో అధికారిక లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీ అభ్యర్థులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news