ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని విశాఖ పర్యటనపై తాజాగా మీడియాతో మాట్లాడిన సజ్జల.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు సజ్జల. అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు సజ్జల. కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖలో చేసిన డ్రామా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని సజ్జల విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ముఖ్యమంత్రి జగన్ ను కుర్చీ నుంచి దించేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల.
ఇప్పటం గ్రామానికి పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు రావడం వారి మధ్య ఉన్న పొత్తులను స్పష్టం చేస్తున్నాయన్నారు సజ్జల. చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో తనపై రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తమ అవసరాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని సజ్జల ఆక్షేపించారు. ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయన్న సజ్జల.. నిజాయతీ, నిబద్ధత ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉంటే వాటిని చెప్పడంలో తప్పులేదన్నారు.