ఆర్టికల్ 370 రద్దుతో ఓ వైపు దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే.. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు తరువాతి స్టెప్ ఏమిటా అని చాలా మందికి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. గతంలోనే ఆయన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరిచారు. ఇక వాటితో జనాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చిన నివేదికల్లోనూ వెల్లడైంది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 370పై ఆయన తీసుకున్న నిర్ణయం వేరు. అప్పట్లో నోట్ల రద్దు, జీఎస్టీలను దేశ వ్యాప్తంగా మెజారిటీ వర్గాలకు చెందిన వారు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని మాత్రం ప్రజలంతా ముక్త కంఠంతో హర్షిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో ఓ వైపు దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే.. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు తరువాతి స్టెప్ ఏమిటా అని చాలా మందికి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగానే బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో అందులో ఉన్న ఇతర అంశాలైన అయోధ్య రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌర స్మృతిలపై ఇప్పుడు అందరి చూపూ పడింది. ఈ క్రమంలోనే త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కొంత కష్టపడితే సాధించవచ్చేమోగానీ.. ఉమ్మడి పౌరస్మృతిని తెచ్చే అంశం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కష్టంగానే పరిణమించనుంది. ఎందుకంటే పౌరస్మృతి అనేది మతానికి సంబంధించినది. అది మన దేశంలో ఉన్న ఒక్కో మతానికి ఒక్కో రకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు.. ఇస్లాంలో బహుభార్యత్వం (ఒక పురుషుడు ఎంత మంది స్త్రీలనైనా వివాహమాడడం) సమ్మతమే. కానీ హిందూ ధర్మం ప్రకారం ఇది నిషేధం. హిందువుల్లో ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలి. ఆ స్త్రీ చనిపోతే లేదా.. విడాకులు తీసుకుంటే.. లేదా ఆమె అంగీకారమైతేనే ఆ పురుషుడు ఇంకో స్త్రీని వివాహం చేసుకునేందుకు వీలుంటుంది. ఇలా మన దేశంలో ఉన్న ఒక్కో మతానికి ఒక్కో పౌరస్మృతి ఉంటుంది. ఈ క్రమంలోనే దేశమంతటా ఒకే పౌర స్మృతి (ఉమ్మడి పౌరస్మృతి)ని అమలు చేయడంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి మాత్రమే కాకుండా.. పీవోకేను ఆక్రమించుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా భారత్‌లో కలిపే అంశంపైనా చర్చ సాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లోక్‌సభలో అమిత్‌షా అవసరమైతే పీవోకే కోసం ప్రాణాలనైనా అర్పిస్తామని ప్రకటించడం.. ఈ అంశానికి మరింత ఊతమిస్తోంది. అయితే ఇప్పటికే పలు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్న మోదీ సర్కారు మరి పైన చెప్పిన విషయాల్లోనూ దూకుడుగానే వ్యవహరిస్తుందా, లేదా అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది.