జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఒకటే భారత్, ఒకటే రాజ్యాంగం కల సాకారమైంది. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 ని అడ్డం పెట్టుకొని పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది.
జమ్ముకశ్మీర్ లో, లఢక్ లో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని… పర్యాటక రంగంలో కశ్మీర్ ను ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇవాళ రాత్రి 8 గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన అంశంపై మోదీ ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి..
చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఒకటే భారత్, ఒకటే రాజ్యాంగం కల సాకారమైంది. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 ని అడ్డం పెట్టుకొని పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది. దేశ ప్రజల అభ్యున్నతి కోసం రూపొందించే ఏ చట్టమైనా ఇక నుంచి కశ్మీర్ లో కూడా వర్తిస్తుంది.
కశ్మీర్ లో ఉగ్రవాదం, కుటుంబవాదం తప్ప ఇంకేం సాధించారు. ఏం సాధించలేదు. కానీ.. ఇప్పుడు జమ్ముకశ్మీర్, లఢక్ లో ప్రస్తుతం కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టికల్ 370 రద్దు అనేది ఒకరి కల కాదు.. చాలామంది కల. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ కల, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల. కోట్ల మంది భారతీయుల కల. ఇప్పుడు అందరి కల నెరవేరింది.
ఇక స్థానిక యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు
విద్యాహక్కు చట్టం దేశమంతా అమలవుతోంది. కానీ.. కశ్మీర్ లో కాలేదు. కశ్మీర్ విద్యార్థులు ఏం పాపం చేశారు. ఇక నుంచి అలా ఉండదు. స్థానిక యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జమ్ముకశ్మీర్ పోలీసులు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వ హోదా లభిస్తుంది.
దేశం మొత్తం… ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది… మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం ఉంది. కానీ.. కశ్మీర్ లో మాత్రం లేదు. దేశ వ్యాప్తంగా కనీస వేతన చట్టం అమలులో ఉంది. కానీ కశ్మీర్ లో లేదు. ఎన్నికల్లో కూడా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ.. కశ్మీర్ లో లేవు. వీటన్నింటికి చెక్ పెట్టడం కోసమే… దేశం మొత్తం అమలయ్యే చట్టాలన్నీ కశ్మీర్ లో అమలవడం కోసమే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.. అని మోదీ స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్, లఢక్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో త్వరలో తెలుస్తుంది
జమ్ముకశ్మీర్, లఢక్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాం. వాటిని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచామో… వాటి ఫలితాలు త్వరలో తెలుస్తాయి. అక్కడ ఇప్పు విద్యుత్ ప్రాజెక్టులు వస్తాయి. కొత్త రోడ్లు వస్తాయి. కొత్త రైల్వే లైన్లు వస్తాయి. విమానాశ్రయాలు వస్తాయి. కుటుంబ పాలన పోయి… ప్రజల పాలన వస్తుంది.
యువత నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది
జమ్ముకశ్మీర్ లో కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. కశ్మీర్ యువత నుంచి కొత్త నాయకులు వస్తారు. ఇక నుంచి జమ్ముకశ్మీర్ లో గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నింట్లో స్థానికులకు సమాన భాగస్వామ్యం ఉంటుంది. ఇక నుంచి కొత్త ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రులను చూస్తాం.. అని ప్రధాని తెలిపారు.
My address to the people of India. https://t.co/f0q8rEUSkH
— Narendra Modi (@narendramodi) August 8, 2019