ఏపీలో రాజకీయాలు మరోసారి తీవ్రంగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ట్వీట్ల యుద్ధం జోరందుకుంది. విపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అధికార పక్షం అదే రీతిలో సమాధానం చెప్పేందుకు రెడీ అయింది. దీంతో ఇరు పక్షాల మధ్య వ్యాఖ్యల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఒకసారి గమనిద్దాం. రాష్ట్రంలో పాలిచ్చే ఆవును ప్రజలు ఓడించి.. దున్నపోతును గెలిపించారని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు.
అదే సమయంలో తనపై దొడ్డిదారిన కేసులు పెట్టించేందుకు అధికార పక్షం వైసీపీ ఢిల్లీలోని బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు రెడీ అయిందని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా.. అందుకే సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలు దుమారం రేపకముందుగానే క్షణాల్లో స్పందించిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి అదే రేంజ్‌లో బాబుపై యుద్ధానికి కాలుదువ్వారు. ప్రతిపక్షం ఏదో అనిందిలే ఆయనసరిపెట్టుకోలేదు. బీజేపీలో టీడీపీని విలీనం చేసేందుకు బాబు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలతో ప్రారంభించి.. తనను, పార్టీని ఆవుతో పోల్చుకోవడం సిగ్గుచేటని బాబుపై విమర్శలు గుప్పించారు.
ఏపీ ఖజానాని ఆయన ఆవుతో పోలుస్తూ.. దీనిని పిండుకుని తాగి తమ్ముళ్లు తెగబలిశారని అన్నారు. అదే సమయంలో నలుగురు బీజేపీ నేతలను మాజీ సీఎం చంద్రబాబు ముందస్తు చర్యల్లో భాగంగానే బీజేపీలోకి వ్యూహాత్మకంగా వలస పంపించారని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్‌లో ఎదురయ్యే సమస్యలు బాబుకు కళ్లముందు కనిపిస్తున్నాయని, అందుకే ఆయన గింగిరాలు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
దీంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇక, ఇప్పుడు లోతైన విషయాల్లోకి వెళ్తే, జగన్ ప్రభుత్వం బాబుపై కేసులు నమోదు చేయాలంటే.. చాలానే స్వేచ్ఛ ఉంది. దీనికి కేంద్రంలోని పెద్దల అనుమతి అవసరం లేదు.
అదే సమయంలో రాష్ట్రంలో టీడీపీని పాడికుండగా పోలుస్తూ.. చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంతటి పాలిచ్చే ఆవైనా.. కొమ్ము విసిరి కల్లోలం సృష్టించేందుకు సిద్ధమైతే.. ఏ పాలేరు(ప్రజలు) మాత్రం చూస్తూ ఊరుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రజలు పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పారు. మరి ఆయా విషయాలు చంద్రబాబుకు తెలియనికావు. కానీ, రాజకీయంగా జగన్‌కు ఎప్పుడు మైలేజీ పెరుగుతుందని ఆయన భావించినా.. వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలగానే భావించాల్సిఉంటుంది. మరి సాయిరెడ్డి గ్రహిస్తారనే అనుకుందాం.