తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారు అని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా దాడులు చేస్తున్నారు. దాడులకు భయపడేది లేదని, మన సమయాన్ని వృధా చేస్తున్నారని కవిత మండిపడ్డారు. మనకు మిగిలిన సమయంలో డబుల్, ట్రిపుల్ పని చేయాలి కానీ వెనక్కి తగ్గొద్దని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయని ఆమె అన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ముందుకు వెళ్లాలి. ప్రజల శక్తి, వారి ప్రేమ ఏంటో తెలిసిన వాళ్లం మనం. ప్రజలను ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్లం. ప్రతి చోట మన కార్యక్రమాలను అమలు చేయాలి. రెస్ట్ తీసుకునేది లేదు.. రిలాక్స్ అయ్యేది లేదు.. భారతదేశం ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం అనేక ఇండెక్సుల్లో కిందకు పడిపోయింది.
ఇటువంటి దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ లోపు మన సత్తా చూపిద్దాం అని కవిత పేర్కొన్నారు. మన భాష, పండుగల మీద జరుగుతున్న వివక్షను ఉద్యమంలో భాగంగా ప్రజలకు వివరించాం. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుపడేవారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే సంతోషంగా జరుపుకుంటున్నారు. అనేక మంది యువకులు, కళాకారులు పాల్గొంటున్నారు. స్కూల్ పాఠ్యాంశాల్లో బతుకమ్మ చేరింది. సంస్కృతి, సంప్రదాయాలకు చోటు లభించింది. రాష్ట్రం సాధించిన తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చుకున్నామని వ్యాఖ్యానించారు కవిత.