ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిన అధ్యాయం అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది. కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ దీనిపై రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ఒకరైన ప్రత్యేక హోదాను కేంద్రం గతంలోనే పక్కనపెట్టింది. ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని అనేకసార్లు చెప్పింది. తాజాగా ఇదే అంశాన్ని కేంద్రం మరోసారి రాజ్యసభలో స్పష్టం చేసింది. పంజాబ్‌కు చెందిన ఓ ఎంపీ ప్రత్యేక హోదా అంశం ఉనికిలో ఉందా ? ఉంటే పంజాబ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించారని కోరారు.
అయితే దీనిపై స్పందించిన కేంద్రం.. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల వల్ల గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు హోదా ఇచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేదని చెప్పింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపినీలో 14వ ఆర్థిక సంఘం తేడా చూపలేదని అభిప్రాయపడింది. 2015-2020 మధ్య పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని వివరించింది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశంపై ఏపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పోలవరం పూర్తి కావడం కష్టమే అని పేర్కొంది. వివిధ కారణాలతో గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదని తెలిపింది. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి రూ. 13,226 కోట్లు చెల్లించామని తెలిపింది.