అనుకున్నదొకటి.. అయింది మరొకటి! అన్న విధంగా జరగడం రాజకీయాల్లో కామనే. అయితే, అన్ని సమ స్యలూ కలిసి ఒకే సారి చుట్టుముడితే.. పరిస్తితి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే.. టీడీపీ ఎదుర్కొంటోంది. ఏపీలో ఘోరాతి ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ.. తెలంగాణలో అసలు జెండా పీకేసే పరి స్థితికి చేరిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించారు చంద్రబాబు. ఏపీ, తెలంగాణల్లో రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చే రేంజ్లో ఆయన పార్టీని నడిపించాలని అనుకున్నా రు. ఈ క్రమంలోనే చంద్రబాబు తనను తాను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
ఇక, ఆయన కుమారుడు లోకేష్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నారు. అయితే, గడిచిన ఐదేళ్లు ఎలా లాక్కొచ్చినా.. గత ఏడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోను, తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఏపీలోనూ ఘోరాతి ఘోరంగా టీడీపీ దెబ్బతింది. ప్రజలకు ఎన్ని దణ్నాలు పెట్టినా.. ఎన్నిహామీలు గుప్పించినా.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడం తర్వాత మాట.. అసలు గౌరవ ప్రదమైన స్థానంలోనూ కూర్చోబెట్టుకోలేక పోయారు. దీంతో పార్టీలోని నాయకుల్లోనూ ఆందోళన ఎక్కువైంది. సరే ఏపీలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా.. ఇప్పుడు తెలంగాణలో మాత్రం పార్టీ జెండా పీకే పరిస్థితి వచ్చింది.
2018 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరారు. మరో ఎమ్మెల్యే మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్ రావులతో పాటు పలువురు టీడీపీ నేతలు ఆదివారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్, అత ని తనయుడు వీరేందర్ గౌడ్ కూడ త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి జిల్లాస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.
అయితే, ఈ తాజా చేరికలు చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న సమయంలోనే చోటు చేసుకోవడం పార్టీలో మరింత కలకలం సృష్టిస్తోంది. ఏదేమైనా.. ఇక, తెలంగాణాను వదులుకోవడమే చంద్రబాబు ముందున్న ఆప్షన్ అంటున్నారు పరిశీలకులు. ఏం జరుగుతుందో చూడాలి. మరోపక్క, బాబు తర్వాత ఎవరు ? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో నాయకులు పక్క చూపులు చూడడం, పార్టీలు మారుతుండడంతో ఇక, టీడీపీ బతికి బట్టకడుతుందా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. మరి ఏం చేస్తారో చూద్దాం.