ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకి గడప గడప కార్యక్రమం గీటురాయిగా భావిస్తున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ అధికారం కైవసం చేసుకోవాలని వైసీపీ.. ఎలాగైనా వైసీపీని గద్దె దించి సీఠం పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం పై సీఎం జగన్ రివ్యూ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జి లతో మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. 175 కు 175 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో గతంలో జరిగిన ఇదే మీటింగ్‌లో నాయకులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని లీడర్లకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మారకపోతే బాధ్యతల నుంచి తప్పిస్తానని హెచ్చరించారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని పరుగులు పెట్టిస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ ఒక్కో నియోజకవర్గంపై సమీక్షలను కంటిన్యూ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోనే లబ్ధిదారులకు నేరుగా 900 కోట్ల సాయం చేశామని ముఖ్యమంత్రి వివరించారు. జనవరి నుంచి బూత్ కమిటీలు, 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథుల్ని నియమించాలని నేతల్ని ఆదేశించారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు, మంత్రి జోగి రమేష్‌కు మధ్య ఉన్న గ్యాప్ చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌తో నెలకొన్న విభేదాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారంలో ఇద్దరూ కలిసి రావాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్.