ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు మంత్రి గంగుల కమలాకర్. పవన్ కళ్యాణ్, కె ఏ పాల్, వైయస్ షర్మిల కు తెలంగాణలో ఏం పని అని అన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. తిరుగుబాటు మొదలెట్టకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. చంద్రబాబు, షర్మిల, కేఏ పాల్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా బిజెపి వదిలిన బాణాలేనన్నారు.
బిఆర్ఎస్ పేరుతో మేము దేశం అంతటా వెళ్తుంటే.. తెలంగాణ పైకి వీళ్లంతా ఎందుకు వస్తున్నారు? గతంలో వీరు తెలంగాణను దోచుకున్న వాళ్ళు కాబట్టే వీళ్ళని వ్యతిరేకిస్తున్నామన్నారు గంగుల. కాలేశ్వరం ప్రాజెక్టుని కూలగొట్టి తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలు కూడా అక్కడి పార్టీలను నమ్మడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు మంత్రి గంగుల.