ఎడిట్ నోట్: కేసీఆర్..తెలుగు ఓట్ల లెక్కలు..!

-

టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చి..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్..బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలనే అంశంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం తెలంగాణలో మాత్రమే బలం ఉంది. తెలంగాణ దాటితే కేసీఆర్‌కు బలం లేదు. కానీ ఆ బలాన్ని పెంచాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మొదట బీఆర్ఎస్ విస్తరణని దేశంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ చేయనున్నారు.

ఇప్పటికే పక్కనే ఉన్న ఏపీలో పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ వైసీపీ సహకరించే దాని బట్టి రాజకీయం చేస్తారని తెలుస్తోంది. ఏపీని పక్కన పెడితే..ఇంకా తెలుగు ప్రజలు అధికంగా కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బెంగళూరు, రాయచూరు, బళ్లారి, బీదర్, తముకూరు, చిత్రదుర్గ, కొప్పల్, కలబురగి, యాద్గిర్, కోలార్, చిక్‌బళ్లాపూర్ లాంటి ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ. అందుకే వాటిపై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేశారు. అక్కడ జేడీఎస్ తో కలిసి కేసీఆర్ ముందుకెళ్లనున్నారు.

కర్ణాటక తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలపర్చాలని కేసీఆర్ చూస్తున్నారు. తెలంగాణకు సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. ముంబై, నవీ ముంబై, నాందేడ్, సోలాపూర్, నాసిక్, ఔరంగాబాద్, నాగ్‌పూర్, భివాండి, ఠాణే..ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు. అలాగే తమిళనాడులో కూడా తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువే. తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పి కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అక్కడ తమిళనాడులో వీసీకే పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్‌లో విలీనానికి ముందుకొచ్చింది.

వాటితో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్‌లోనూ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, సుక్మా, బస్తర్, బిలాస్‌పూర్… ఒడిశాలోని భువనేశ్వర్, ఛత్రాపూర్, రాయగడ, మల్కన్‌గిరి, పర్లాకిమిడి, గంజాం, నబరంగపూర్.. గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్, వడోదర, కచ్, జామ్‌నగర్, ద్వారక… ప్రాంతాలపై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. అయితే తెలుగు వాళ్ళు ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందనుకుంటే పొరపాటే..అక్కడ స్థానికంగా పట్టు సాధిస్తేనే పార్టీ నిలవగలదు. మరి కేసీఆర్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news