ఉత్తమ్ ఫ్యామిలీనే టార్గెట్ చేశారా? పార్టీ మార్పుపై క్లారిటీ?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. కానీ ఈయనే పార్టీ మారతరనే ప్రచారం జరగడం కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ రేపింది. మిలటరీ నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసి అభిమానంతో కాంగ్రెస్ లో చేరి..1994 ఎన్నికల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నారు.

అలాంటి నాయకుడు ఇటీవల..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్టీ పదవుల్లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. దీంతో టీడీపీ నుంచి వచ్చిన వారు పదవులకు రాజీనామాలు చేశారు. ఇక దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీని సరిచేసే కార్యక్రమం చేశారు. అయితే అలా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంపై ఉత్తమ్‌ కోవర్టు అనే ప్రచారం వచ్చింది. ఈయన కేసీఆర్‌కు కోవర్టుగా పనిచేస్తున్నారని ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి.

అలాగే ఈయన పార్టీ మారతారని ఇటీవల ప్రచారం కూడా వచ్చింది. ఇదంతా సొంత పార్టీ వాళ్లే చేస్తున్నారని ఉత్తమ్ వర్గం అంటుంది. ఇక కాంగ్రెస్ అంటే అభిమానంతో ఉండే ఉత్తమ్ సైతం..పార్టీ మార్పుపై స్పందించాల్సి వచ్చింది. బతికున్నంత వరకు తాము కాంగ్రెస్‌లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు స్పష్టం చేశారు.

పార్టీ మారుతున్నట్లు రెండు నెలలుగా కొంతమంది తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని పార్టీ నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఖండించాలని, తమ కుటుంబంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని,  తమకు పిల్లలు లేకపోయినా ప్రజలే తమ పిల్లలుగా భావించి కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నామని చెప్పారు. తాము జీవితాంతం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్, కోదాడల్లో భారీ మెజారిటీలతో గెలుస్తామని అన్నారు..కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖయాని చెప్పారు. మొత్తానికి ఉత్తమ్ లాంటి నేతలు సైతం పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news