ట్రాఫిక్ రూల్స్ పాటించమని పోలీసులూ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కానీ వాటిని పాటించేవాళ్లే తక్కువ. ఏదో ఒక సందర్భంగా రూల్స్ బ్రేక్ చేయక తప్పదు.. దొరికిన వాడే దొంగ అన్నట్లు.. పోలీసుల కంటపడిన రోజే జరిమానా వేస్తారు. రహదారిపై బైక్ పార్కింగ్ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా, హెల్మెంట్ లేకుండా బైక్ నడిపినా, ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు వేయడం కామన్.. అయితే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని బైక్‌ను ఓ ఏనుగు ఎత్తికుదేసింది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ఏనుగు ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ఏనుగు.. రహదారిపై పార్క్ చేసిన బైక్ వద్దకు రాగానే ఉన్నట్లుండి పిచ్చకోపంతో.. బైక్‌ను తన కాలితో ఓ తన్నుతన్నింది. ఇంకేముంది.. బైక్ ఫుట్ బాల్ ఎగిరినట్లు ఎగిరి రోడ్డుపక్కకు కొద్దిదూరంలో పడిపోయింది. హైలెట్ ఏంటంటే..అక్కడ అన్ని బైకులు ఉన్నా..కేవలం రోడ్డుపైన పార్క్‌చేసిన బైక్‌నే ఏనుగు ధ్వంసం చేసింది. మిగతావి ఫుట్‌పాత్‌పైన ఉన్నాయని లైట్ తీసుకున్నట్లు ఉంది.
ఈ వీడియోను బెంగళూరులోని తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘ ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయొద్దు’ అని రాశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 3.5 లక్షల మంది వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
ఏనుగుకు పోలీస్ ఉద్యోగం ఇచ్చారా ఏంటి అని ఓ నెటిజన్ అంటే.. ఇలాంటి ఏనుగు బెంగుళూరు లాంటి రద్దీగా ఉండే రహదారులపై ఉండటం చాలా అవసరం అని మరొక నెటిజన్ అన్నారు. ఏనుగుకి ట్రాఫిక్ రూల్స్ బాగా తెలిసినట్లు ఉంది అని మరొకరు..ఇక ఈ వీడియో చూస్తే.. రోడ్డుపై బండి పార్క్ చేయాలంటే వాహనదారులు భయపడాల్సిందే అని మరొకరు.. కమెంట్ చేశారు.. ఇలా ఈ వీడియోపై అందరూ స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం క్రేజీగా ఉందిలే..! మీరు చూడండి.!!