నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పక్కనున్న మరో నాలుగు కార్లకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వీకెండ్ కావడంతో సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు పోటెత్తారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సందర్శకుల తాకిడి పెరిగింది. పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ ను రోజూ వేల సంఖ్యలో సందర్శిస్తున్నట్లు బుకింగ్ కిమిటీ ఛైర్మన్ హన్మంత్ తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేసినట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్ కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది.
2019లోనూ నుమాయిష్ లో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో స్టాళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించారు.