ప్రపంచవ్యాప్తంగా అరటి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మిలియన్ల మందికి ఆహారం, పోషణ మరియు ఆదాయాన్ని అందిస్తాయి. సహజంగా భారత్‌లో అరటి పండు వినియోగం అధికం. అరటి పంటపై చాలా మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ఈ అరటి సాగులోనూ మనదేశం ముందంజలో ఉంది. అయితే 2050 నాటికి భారత్‌తోపాటు మరికొన్ని దేశాల్లో అరటి పంట పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్‌లోని ఎక్స్‌టర్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పు వల్ల భారతదేశంలో అరటి ఉత్పత్తిలో గణనీయమైన క్షీణతకు దారితీస్తుందని తెలిపారు. వీరు ప్రంచంలోని ప్రముఖ అరటి ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారులపై వాతావరణ మార్పులు… భవిష్యత్తు ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ప్రపంచానికి 86 శాతం అరటిని అందిస్తున్న 27 దేశాల్లో వారు అధ్యయనం నిర్వహించగా.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం ఉష్ణమండల పంట అయిన అరటిపై కీలక ప్రభావం చూపుతున్నాయని గుర్తించినట్టు వారు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా అధికంగా అరటి సాగు చేస్తున్న భారత్, బ్రెజిల్‌తోపాటు మరో ఎనిమిది దేశాల్లో 2050 నాటికి అరటి దిగుబడిపై వాతావరణ మార్పుల యొక్క ప్రభావాలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంటే అరటి ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని లేదా పూర్తిగా మాయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరించారు.