నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తారకరత్నకు ఎలాంటి ఎక్మో సపోర్ట్ పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం తారకరత్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని, ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తున్నాడని నందమూరి రామకృష్ణ వెల్లడించారు. అయితే, అనూహ్యంగా సాయంత్రం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో అభిమానులు, టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు.
అయితే.. నందమూరి తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. తారకరత్న గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పని చేయడం లేదని తెలుస్తోంది. గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్స్ ఉండటంతో ఎక్మో ద్వారా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారని సమాచారం. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు ఆయనకు కుప్పంలోని హాస్పిటల్‌లోనే చికిత్సను అందించగా తరువాత పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, బెంగళూరుకు తరలిస్తున్నారని తెలిసింది. అయితే తరువాత వద్దనుకున్నా చివరికి ఈ తెల్లవారు జమున ఆయనను బెంగళూరుకు తరలించారు.