రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 14 వరకూ నిర్వహించే అవకాశాలున్నాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం సర్దుకుంటుందని తాను ముందే చెప్పానన్నారు. గవర్నర్తో విభేదాలు వస్తాయి.. పోతాయని, గవర్నర్, ప్రభుత్వం, అసెంబ్లీ.. ఒకదానికొకటి సమ్మిళితమై ఉంటాయని, ఇందులో ఎవరి విజయం ఉండదని తెలిపారు.
తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, చేయాలా? వద్దా? అనేది పార్టీ నిర్ణయిస్తుందని గుత్తా చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉందనీ, అయితే బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నల్గొండలో ఈసారి బీఆర్ఎస్కు అధిక స్థానాలు దక్కుతాయని, వామపక్షాల పొత్తు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిధర్ గమాంగ్ సీనియర్ నాయకుడని, ఆయన చేరికతో భారాసకు అదనపు బలం చేకూరిందని తెలిపారు.