తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసైకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకమైన తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకమైన తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా ఆమెకు కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హోం మంత్రి మహమూద్ అలీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. మరికాసేపట్లో తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 5 రాష్ర్టాలకు నూతన గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్ర భాజపా నేత బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు. ఇక తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌కు కేసీఆర్ సహా మంత్రులందరూ ఘనంగా వీడ్కోలు పలకగా ఇప్పుడు ఆయన స్థానంలో గవర్నర్‌గా తమిళిసై వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెను రిసీవ్ చేసుకునేందుకు నేతలందరూ తరలివెళ్లారు.

తమిళిసైకి స్వాగతం పలికిన వారిలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ సంతోష్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌లు ఉన్నారు. కాగా సీఎం కేసీఆర్ వారందరీని గవర్నర్‌కు పరిచయం చేశారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news