మరోసారి మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రపై మరోసారి సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమీటీ నివేదిక రాక ముందే, రాష్ట్ర రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.. ప్రభుత్వం సహకరించాలని నారా లోకేష్ పదే పదే అనడంలో ఉద్దేశం ఏమిటి..!? అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. అసలు లోకేష్ పాదయాత్రకు ప్రజలు ఎవరూ రావడం లేదు.. ఆ పాదయాత్రకు ఏమైనా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పంపాలా..? అంటూ పంచ్‌లు విసిరారు మంత్రి అమర్నాథ్. లోకేష్ యాత్ను చూసి చంద్రబాబే సైకో అయ్యారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కి “స్టార్ కాంపైనర్” లోకేషే.. రాష్ట్రంలో నారా లోకేష్ ఎంత తిరిగితే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
కాగా, గతంలోనూ లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్.. లోకేష్ పాదయాత్ర కాదు కదా పాక్కునే యాత్ర చేసినా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు.. అసలు పాదయాత్ర చేయడానికి నారా లోకేష్ కి ఉన్న అర్హత ఏంటని నిలదీసిన ఆయన.. పాదయాత్రలు వైఎస్ ఫ్యామిలీ పేటెంట్ హక్కు అని చెప్పారు. ఎందుకీ యాత్ర..? అసలు నారా లోకేష్ పాదయాత్రకు అర్థమేముందని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. గతంలో వైఎస్ఆర్, జగన్ చేసిన పాదయాత్రలకు ఓ అర్థం ఉందని, అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు పాదయాత్రలు చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, మూడున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్తుంటే వారు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరం లోకేష్ కి ఏమొచ్చిందంటూ గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.