వందేభారత్‌ కోచ్‌లను కాజీపేటలో తయారు చేయండి.. లోక్​సభలో ఎంపీ ఉత్తమ్​

-

కాజీపేటలో వందేభారత్ కోచ్​లను తయారు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్​సభలో డిమాండ్ చేశారు. విభజన చట్టంలో చెప్పిన ప్రకారం హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మేధ ప్రైవేటు ఫ్యాక్టరీలో తయారవుతున్న వందేభారత్‌ కోచ్‌లను తుదిరూపుదిద్దడానికి తమిళనాడు, పంజాబ్‌లలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలకు పంపుతున్నారని, ఆ పనిని కాజీపేటలోనే పూర్తిచేయాలని సూచించారు. ‘రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, సుందరీకరణ’ అంశంపై చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్ప ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఉత్తమ్‌ పాల్గొని మాట్లాడారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 93, షెడ్యూల్‌ 13లో చెప్పిన ప్రకారం తెలంగాణ- ఏపీ మధ్య ర్యాపిడ్‌ రైల్‌ కనెక్టివిటీ నిర్మాణం ప్రారంభించి 2024కల్లా పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ప్రారంభంకాలేదు. సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌-విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు కనెక్టివిటీ కల్పించాలి. జాతీయ రహదారి 65 వెంబడి సేకరించిన భూమిని ఉపయోగించుకొని ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు మార్గం నిర్మించాలి.’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news