దేశంలోని పలుచోట్ల భూప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు చెన్నై, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యాణ, నేపాల్‌లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.
అదేవిధంగా నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఉదయం పొరుగు దేశం నేపాల్‌లో భూమి స్వల్పంగా కంపించగా.. ఆ ప్రభావం ఉత్తర భారతదేశంలో చూపించినట్లు స్పష్టమవుతోంది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.గత ఏడాది నవంబర్‌లో, దేశం నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది, బుధవారం దోటి జిల్లాలో ఇల్లు కూలిన సంఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. అప్పుడు కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిన్న భూమి స్వల్పంగా కంపించింది.