మరొకసారి ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న పవన్..తాజాగా ఏపీకి వచ్చారు. మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అదే సమయంలో బీసీ నేతలతో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీసీలకు పలు హామీలు ఇచ్చారు.
అదే సమయంలో తాను కాపు నాయకుడుని కాదని, అన్నీ కులాలకు నాయకుడుని అని చెప్పుకొచ్చారు. ఇక బీసీలు-కాపులు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంతో అత్యధికంగా ఉన్నవారికి అధికారం దక్కడం లేదని..ఈ సారి వారికి అధికారం దక్కాలని కోరారు. అంటే కాపులతో బీసీల ఓట్లని సాధించడం కోసమే పవన్ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అంతకముందు దళిత వర్గాలతో కూడా పవన్ సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. అంటే బిసి-దళితులు-కాపులు ఓట్లు టార్గెట్ గా పవన్ పవర్ పాలిటిక్స్ నడపటానికి సిద్ధమయ్యారనే చెప్పవచ్చు.
అయితే రాష్ట్రంలో బిసి-దళిత-కాపు ఓట్లే కీలకమనే చెప్పాలి. వారు మెజారిటీ ఎటువైపు ఉంటే వారు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. వారి ఓట్ల కోసం పవన్ రాజకీయం తప్పు లేదు గాని..ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపీలని కాదని జనసేన వైపు ఎంతమంది మొగ్గు చూపుతారనేది చెప్పలేం. ఇప్పుడుప్పుడే జనసేన బలం పెరుగుతున్న మాట వాస్తవమే ..కానీ అది అధికారంలోకి వచ్చేంత బలం కాదు.
ఇంకా క్షేత్ర స్థాయిలో జనసేన బలం పెరగలి. కేవలం గోదావరి జిల్లాల్లోనే జనసేనకు బలం కనిపిస్తుంది. అలాంటప్పుడు మిగిలిన జిల్లాల్లో బలపడాల్సిన అవసరం ఉంది. బలమైన నాయకులు జనసేనకు కావాలి. అప్పుడే పవన్ ఎలాంటి స్ట్రాటజీలైన ఫలిస్తాయి.