ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సభలో మాట్లాడుతూ, స్టేషన్ ఘనపుర్ నియోజకవర్గం తన వల్ల మహిళల ఆత్మగౌరవానికి కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. తాను మహిళల అభివృద్ధి, వారి ఆత్మ గౌరవం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించారు. తనకు నలుగురు చెల్లెల్లు ఉన్నారని..తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని అన్నారు రాజయ్య. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య అందరిముందు క్షమాపణ కోరారు.
జానకిపురం గ్రామాభిృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు రాజయ్య. అభివృద్థి అనేది నిరంతర ప్రక్రియ అని..జానకిపురం గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ నవ్యప్రవీణ్ కు ఆదేశాలు ఇచ్చారు. జానకిపురం గ్రామాభివృద్ధికి సర్పంచ్ నవ్య ప్రవీణ్‌తో కలిసి పనిచేస్తామన్నారు. గతంలో సర్పంచ్ టికెట్ ఇచ్చే సమయంలో తాను ప్రవీణ్ ను మాత్రమే చూశానని..నవ్యను ఎప్పుడు చూడలేదన్నారు ఎమ్మెల్యే రాజయ్య.