ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఏడవ రోజు సోమవారం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుండి సభలో టిడిపి సభ్యులు ఆందోళన, వారిని సస్పెండ్ చేయడం నిత్య కృత్యంగా జరుగుతుండగా.. నేడు ఘర్షణ వరకు దారితీసింది. ఈ పరిణామాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి సభ్యులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి తనపై వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదని.. కచ్చితంగా స్పీకర్ పదవిని అవమానించడమేనని అన్నారు.
అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ చైర్ లో కూర్చోవడాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు మంత్రి ఆర్కే రోజా. బీసీలు అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకనే అని చెప్పుకొచ్చారు. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. స్పీకర్ పై టిడిపి సభ్యులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి రోజా.