ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ శనివారం కీలక ప్రకటన చేసింది. మంగళగిరిలోని నవులూరు వద్ద మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం వేసిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్ లో ప్లాట్ల కొనుగోలు కోసం మరోసారి ప్రకటన జారీ చేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లే అవుట్ వేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జగనన్న లే అవుట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను, 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు సిఆర్డిఏ కమిషనర్ గతంలోనే తెలిపారు. అయితే ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అయినా, జగనన్న లే అవుట్ లో ప్లాట్ ను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.