మొక్కలు నాటడం మానవాళికి చాలా అవసరం.. చుట్టూ పచ్చదనం ఉంటే.. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పల్లెల్లోకి అడుగుపెడుతూనే..మనకు ఎన్నో చెట్లు స్వాగతం చెబుతాయి. ఎటూ చూసినా ఏదో ఒక చెట్టు ఉంటుంది. ఇక ఇంటికో కొబ్బరిచెట్టు, వేపచెట్టు ఇలాంటివి అయితే కచ్చితంగా ఉంటాయి. చుట్టు చెట్లు ఉంటే చూసేందుకు కళ్లకు హాయిగా ఉంటుంది. ఇంకా వాటివల్ల మనకు స్వచ్ఛమైన ఆక్సీజన్ వస్తుంది. కానీ ఇప్పుడు పట్టణాల్లో పరిస్థితులు మారిపోయాయి.. చెట్లు నాటడం అవసరం అని ప్రభుత్వాలు..ప్రత్యేక పథకాలు తెచ్చి మరీ మొక్కలు నాటుతున్నా..అవి అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి..ఇంకాస్త పెద్ద సిటీల్లో అయితే.. మొక్కలు నాటుదాం అన్నా స్థలం లేదు. చూసినంత మేర ఎలాంటి చెట్లు లేకుండా పోతున్నాయి.. అందుకే దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించారు శాస్త్రవేత్తలు. మొక్కలు ఎలా అయితే కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను వదులుతాయో.. అలాంటి ఓ లిక్విడ్ ట్రీని కనిపెట్టారు.
లిక్విడ్ ట్రీ అంటే ఏంటంటే..
సెర్బియన్ సైంటిస్టులు కనుగొన్న లిక్విడ్ ట్రీ పరికరం వల్ల కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్‌గా మారుతుంది. దీనికి లిక్విడ్ 3 అని పేరు పెట్టారు. ఇదొక ఫోటో బయో రియాక్టర్. సెర్బియాలోని బెల్ గ్రేడ్ నగరంలో స్టారిగ్రేడ్ మున్సిపాలిటీ ముందు లిక్విడ్ ట్రీ పరికరాన్ని ఉంచారు. అచ్చం మొక్కల వలె, కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. ఫోటో సింథసిస్ కారణంగా ఆక్సిజన్‌గా మారి గాల్లోని కార్బన్ డై ఆక్సైడ్‌ను ఇది పీల్చుకుంటుంది.
గ్లాస్ ట్యాంక్ మాదిరిగా ఉండే ఫోటో బయో రియాక్టర్‌లో 600లీటర్ల నీరు ఉంటుంది. అలాగే ఆ నీటిలో మైక్రో ఆల్గే ఉంటుంది. ఈ ట్యాంక్ పైన సొలార్ ప్లేట్ ఉండడం వల్ల చిన్న పంప్ ఆన్ ఐపోయి, ట్యాంకుకు ఉన్న చిన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు సూర్యకిరణాలు మైక్రో ఆల్గే మీద పడి ఫోటో సింథసిస్ (కిరణ జన్య సంయోగక్రియ) ప్రక్రియ జరుగుతుందనమాట…ఈ పద్దతి కారణంగా గాల్లో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నీళ్ళలో కలిసిపోయి ఆక్సిజన్‌గా బయటకు విడుదలవుతుంది.
పెద్ద పెద్ద నగరాల్లో.. మొక్కలను పెంచడం కష్టం కాబట్టి ఇలాంటి లిక్విడ్ ట్రీ ట్యాంకులను ఏర్పాటు చేసుకుంటే మంచిదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.