మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగరాలన్నారు సీఎం కేసీఆర్. సరిహద్దు ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని కందార్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో మహారాష్ట్రలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.
మహారాష్ట్రలోనూ బిఆర్ఎస్ ను రిజిస్టర్ చేయించామని.. మనం సత్తా చాటితే.. పంచాయితీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరించి చూపిస్తామని అన్నారు కేసీఆర్. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదన్నారు.
తనతో కలిసి యుద్ధం చేయాలని.. నీళ్లు, కరెంట్ వస్తాయని అన్నారు. మహారాష్ట్రలోని బిఆర్ఎస్ సభకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మీరు తెలంగాణ సీఎం అని, మీకు మహారాష్ట్రలో ఏం పని అని అన్నారని.. కానీ తాను భారతదేశ బిడ్డను.. నాకు దేశంలో ఎక్కడికి వెళ్లడానికైనా హక్కు ఉందన్నారు.