తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో న్యాయం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. ముఖ్యంగా దినదినాభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ.. కేంద్రం చేతులెత్తేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి లేఖ రాశారు.
‘‘అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తోంది. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్‌నవూ, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, మేరట్ వంటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించింది. ఇలాంటి నగరాలకు మెట్రో రైలుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం.. హైదరాబాద్‌లో విస్తరణకు అర్హత లేదని చెప్పడం అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం హైదరాబాద్. ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదన అర్థరహితం.’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.