ప్రధాని నరేంద్ర మోడీ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అన్నది కూడా మరిచిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రధాని మోడీకి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్న మోడీ..తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. ఏపీ విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహకరిస్తుందన్నారు. తెలంగాణను ముంచి అదానీకి దోచి పెడతామంటే తామెందుకు సహకరిస్తామని అన్నారు. పదో తరగతి పేపర్లు లీక్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న బీజేపీ కుయుక్తులను కేసీఆర్ తెలివిగా తిప్పికొట్టారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిది ఏళ్లలో ఒక్క గడ్డపార కూడా ఇవ్వలేదన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేస్తే కచ్చితంగా ఆ పాపం నిన్ను వెంటాడుతదన్నారు. తమపై ఏ కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామని..ఎట్టి పరిస్థితుల్లో మోడీకి సహకరించే ప్రసక్తే లేదన్నారు. మోడీని గద్దె దింపే వరకు వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.