హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలో ఘటనలో దోషికి జైలు శిక్ష పడింది. గతేడాది ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు డ్రైవర్ రజనీకుమార్‌ను దోషిగా తేల్చింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
గతేడాది అక్టోబర్ 17న ఈ ఘటన జరిగింది. పాఠశాలలో చదువుతున్న బాలికపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీ కుమార్(34) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ రూమ్ ఎదురుగా ఉన్న ల్యాబ్‌లోనే డ్రైవర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్‌పై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేశారు.
అసలేం జరిగిందంటే.. రెండు నెలలపాటు డ్రైవర్ రజనీ కుమార్ ఎల్కేజీ చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. రెండు నెలలుగా బాలికపై అత్యాచారం చేయండతో నీరసంగా కనిపించిన చిన్నారిని ఏమైందని తల్లి అడగగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగమంతా బయటకు వచ్చింది.