తెలంగాణలో అసెంబ్లీ రద్దు అనంతరం ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో గా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన చేసిన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు అన్ని మాధ్యామాలను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మధ్యామాల ద్వారా జిల్లా అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో నే ఈవీఎంల పనితీరుని పరిశీలిస్తున్నామని చెప్పారు. గ్రామ స్థాయిలోనూ ప్రజలను చైతన్య పరిచేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో మొత్తం 35 వేలకు పైగా ఉన్న ఎలక్షన్ బూత్ లకు తోడుగా వీలైన కొన్నింటిని ఏర్పాటు చేస్తామన్నారు.