అలస్కాలో కుప్పకూలిన యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లు

-

అలస్కాలోని ఫోర్ట్ వైన్‌రైట్‌లో శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తూ హీలీ సమీపంలో కూలిపోయాయి. గురువారం జరిగిన ఈ ఘటన గురించి తాజాగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ ప్రకటన జారీ చేసింది. వాటిని ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్లుగా గుర్తించినట్లు తెలిపింది.

ఈ రాష్ట్రంలో సైనిక హెలికాప్టర్లు ప్రమాదానికి గురికావడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి. ఒక్కోదానిలో ఇద్దరు చొప్పున ఉన్నారని అలస్కా యూఎస్‌ ఆర్మీ ప్రతినిధి జాన్‌ పెన్నెల్‌ తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదని, అందులోని వ్యక్తుల పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేమని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన చోట ఫస్ట్‌ రెస్పాండర్స్‌ ఉన్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. సంఘటనపై విచారణ జరుపుతున్నామని.. సమాచారం అందుబాటులోకి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తల్కీట్నా నుంచి టేకాఫ్‌ అయిన అపాచీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news