నటజీవితంలో తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఎన్టీఆర్ తో తనకు ఎంతో బాంధవ్యం ఉందని వివరించారు. నందమూరి తారకరాముడు యుగపురుషుడని రజనీకాంత్ కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
‘ఏం మాట్లాడాలో జ్ఞానం, బుద్ధి చెబుతుంది. ఎలా మాట్లాడాలో సమర్థత చెబుతుంది. ఎంతసేపు మాట్లాడాలో సభ చెబుతుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుంది. ఇంత పెద్ద సభను చూస్తే రాజకీయం మాట్లాడాలనిపిస్తున్నా.. వద్దురా రజనీ, జాగ్రత్త, రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దని అనుభవం చెబుతుంది. కానీ ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి కొద్దిగా అయినా రాజకీయం మాట్లాడకపోతే అది సభా సంస్కారం కాదు’ అంటూ రజనీకాంత్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ ప్రసంగంలో రజనీ.. చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్ నగరాన్ని తలపించేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఇప్పుడు లక్షల మంది తెలుగువారు దేశవిదేశాల్లో ఐటీ రంగంలో పనిచేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారంటే చంద్రబాబే కారణమని ప్రశంసించారు.